నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్వాకం కారణంగా గురుకులాలకు శాపంగా మారిందని ఆవేదన చెందారు. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పట్టింపు లేని తనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని వాపోయారు హరీశ్ రావు.
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయాల పాలవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
తక్షణం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు తన్నీరు హరీశ్ రావు.
కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్ పాయిజన్ కేసులు సర్వ సాధారణంగా మారి పోయాయని ఆరోపించారు. ఇప్పుడు ఆ జాబితాలో కరెంట్ షాకులు కూడా చేరడం దారుణమన్నారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, గాడి తప్పిన గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు తన్నీరు హరీశ్ రావు.