ఈడీ..మోడీ ఒక్కటే – హరీశ్ రావు
షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఈడీ, మోడీ రెండూ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీతో కలిస్తే జోడీ ఉంటుందని లేక పోతే ఈడీ ఎంటర్ అవుతుందన్నారు. తాము ఆ పార్టీతో కలవ లేదని అందుకే తమ నాయకురాలు, ఎలాంటి తప్పు చేయని ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేశారని, ఆపై జైల్లోకి పంపించారని ఆరోపించారు.
బీజేపీ చేసిన నిర్వాకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మీద మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారని, ఆ తర్వాత విచరాణ జరిగిందన్నారు. వెంటనే బీజేపీలోకి జంప్ కాగానే కేసు మూసేశారని ఆరోపించారు తన్నీరు హరీశ్ రావు.
ఎయిరిండియా విమానాల కొనుగోలు గోల్ మాల్ జరిగిందని కేంద్ర మాజీ మంత్రి ప్రపుల్ పటేల్ పై కేసు నమోదైందని, ఆయన జంప్ అయ్యేసరికి కేసు లేకుండా పోయిందన్నారు. శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నిక్ మీద ఈడీ దాడి చేసింది..ఆయన బీజేపీ తీర్థం పుచ్చు కోగానే కేసు లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి.
అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ పై శారద చిట్ ఫండ్స్ స్కాంలో ఉన్నారు. ఆయనపై కేసు నమోదు చేసేసరికి జంప్ అయ్యారు. ఆ వెంటనే కేసు క్లోజ్ చేశారని ధ్వజమెత్తారు. టీడీపీకి చెందిన సుజనా, సీఎం రమేష్ పై కేసులు ఉండేవని వారు బీజేపీలో చేరగానే లేకుండా పోయాయని మండిపడ్డారు.
ఇక పంజాబ్ మాజీ సీఎం అమరేంద్ర సింగ్ కుమారు రవీంద్ర సింగ్ పై ఫెమా, ఈడీ, సీబీఐ కేసులు ఉండేవని , బీజేపీలో జంప్ కాగానే వాటిని తీసేశారంటూ ఫైర్ అయ్యారు. బెంగాల్ కు చెందిన సువేందు అధికారిపై సవాలక్ష ఆరోపణలు ఉన్నాయని, ఆయన బీజేపీలో చేరగానే క్లోజ్ అయ్యాయని ఆరోపించారు.
గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్, మరాఠా మాజీ సీఎం అశోక్ చవాన్ లపై కేసులు ఉన్నాయని వారు జంప్ కాగానే అన్నింటిని మూసి వేశారని మండిపడ్డారు.