సీఎం రేవంత్ రెడ్డివి చిల్లర రాజకీయాలు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు హరీశ్ రావు.
ప్రధానంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్నది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారిని తమ పార్టీలో చేరాలని బెదిరింపులకు దిగడం లేదంటే హైడ్రా పేరుతో కేసులు నమోదు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేశారని ఆరోపించారు. అంతే కాకుండా ఆయనకు చెందిన విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు అక్రమంగా కట్టారంటూ నోటీసులు పంపించడం, కేసులు నమోదు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు.
ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై 6 కేసులు నమోదు చేశారని, ఏదైనా ఉంటే ముందు చెప్పాలన్నారు. మానసికంగా, పొలిటికల్ గా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ పని చేస్తోందని ధ్వజమెత్తారు. హైడ్రాను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారంటూ ఆరోపించారు.