ఏపీకి 100 కోట్లు సరే తెలంగాణ మాటేమిటి..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ మోడీ సర్కార్ ను ఏకి పారేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా హరీశ్ రావు బయట పెట్టారు.
గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100 కోట్లు ఇచ్చిందని , కానీ తెలంగాణకు ఒక్క పైసా కూడా కేటాయించక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచారని , వీరిలో ఇద్దరు కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారని వీరంతా ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. నిద్ర పోతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్ ఘోరంగా విఫలం అయ్యాయని ఆరోపించారు హరీశ్ రావు.
ఇక కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జీరో రాగా, ఆంధ్రప్రదేశ్‌కు 15,000 కోట్ల అదనపు గ్రాంట్లు వచ్చాయని అన్నారు. తెలంగాణ మళ్లీ పక్కదారి పడుతుందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అసలు తెలంగాణ అనేది ఈ దేశంలో లేదని అనుకున్నారా అని ఫైర్ అయ్యారు.