ఎవ్వరినీ వదిలి పెట్టం – హరీశ్
పోలీసులు..అధికారులపై ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కదా అని పోలీసులు, ఉన్నతాధికారులు కొంత మంది రెచ్చి పోతున్నారని ఆరోపించారు. వారి పేర్లను తాము రాసి పెట్టుకుంటున్నామని హెచ్చరించారు.
అధికారం ఏ ఒక్కరికీ , ఏ పార్టీకి స్వంతం కాదన్నారు. తాము కూడా రాబోయే రోజుల్లో పవర్ లోకి వస్తామని , ఆరోజున మీ అందరి భరతం పడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తన్నీరు హరీశ్ రావు. చట్టం పరిధిలో ఎవరైనా పని చేయాల్సి ఉంటుందన్నారు. కానీ చట్టాన్ని అతిక్రమించి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమంటూ మండిపడ్డారు .
ఎంతటి వారైనా, ఏ స్థానంలో ఉన్నా సరే ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు హరీశ్ రావు. ఇక కొందరు నాయకులు పార్టీని వీడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారంతా అవకాశవాదులని, పదవులు తప్ప వారికి ప్రజా సేవ గుర్తుకు రాదన్నారు. పార్టీని వీడుతున్న వాళ్లంతా రాలి పోయే ఆకులు లాంటి వారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.
ఇది ఆకులు రాలే కాలమని, మళ్లీ కొత్త చిగురు రాక తప్పదని, కొంత మంది నాయకులు వెళ్లి పోవచ్చని, కానీ బీఆర్ఎస్ పార్టీ సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఉంటుందని స్పష్టం చేశారు హరీశ్ రావు.