NEWSTELANGANA

స్పెష‌ల్ పోలీసులూ మ‌న బిడ్డ‌లే – హ‌రీశ్ రావు

Share it with your family & friends

సీఎం మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచించాలి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ముఖ్య‌మంత్రి పోలీసుల స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వినాల‌ని సూచించారు. స్పెష‌ల్ పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడ‌గాల‌ని , వారికి న్యాయం చేయాల‌ని కోరారు.

తన వ్యక్తిగత భద్రత నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించడం అనాలోచిత నిర్ణయం అని పేర్కొన్నారు మాజీ మంత్రి. పదిహేడు వేల మంది స్పెషల్ పోలీసులను తన చర్యతో సీఎం అవమాన పరిచారని వాపోయారు. తండ్రి కొడుకులను విశ్వాసంలోకి తీసుకోనట్లుగా ఉంది రేవంత్ రెడ్డి చర్య అని పేర్కొన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

స్పెషల్ పోలీసులు అంటే రాష్ట్రానికి మిలిటరీ లాంటి వారని, వారి ఆత్మస్థైర్యాన్ని సీఎం దెబ్బ తీయకూడదన్నారు. స్పెషల్ పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం తక్షణమే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఏక్ పోలీస్ విధానాన్ని తీసుకురాబోతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం ఇప్పుడు స్పెషల్ పోలీసుల ఆందోళనపై కనీసం స్పందించక పోవడం ఎంత వరకు సమంజసం అని ప్ర‌శ్నించారు.

సస్పెండ్, డిస్మిస్ అయిన స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లను తక్షణమే విధుల్లోకి చేర్చేందుకు సీఎం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

స్పెషల్ పోలీసుల పై సచివాలయ ముఖ్య భద్రతా అధికారి ఎమర్జెన్సీ తరహాలో ఆంక్షలు పెడుతూ విడుదల చేసిన సర్క్యూలర్ ను వెంటనే ఉపసంహరించు కోవాలని అన్నారు.

సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌లు చేసినా, ఆ పోలీసులు పట్ల చర్యలు ఉంటాయని పేర్కొనడం దుర్మార్గ‌మ‌న్నారు. భావప్రకటన స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును హరించే అధికారం ఎవరికీ లేదన్నారు.