సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం – హరీశ్ రావు
రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందంటూ ఫైర్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని ఆరోపించారు.
ప్రజా పాలన పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు సీఎం తెర తీశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు తన్నీరు హరీశ్ రావు. ఓ వైపు హైడ్రా పేరుతో వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. బాధితులు రోజు రోజుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంంటుంటే వారిని పట్టించుకోక పోవడం భావ్యం కాదన్నారు.
ఫార్మా సిటీని పక్కన బెట్టి ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా అవతారం ఎత్తాడంటూ ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు మాజీ మంత్రి .
మూసీ సుందరీకరణ పేరుతో మరో రియల్ ఎస్టేట్ దందాకు తెర తీశాడని, ప్రపంచంలో ఎక్కడా లేనట్లు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డీపీఆర్ కే రూ. 1500 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటూ ధ్వజమెత్తారు హరీశ్ రావు.
జరుగుతున్న బాగోతాన్ని బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎండ గడుతూనే ఉంటుందని హెచ్చరించారు. మొన్న రూ. 50 వేల కోట్లు అవుతుందని , నిన్న రూ. 70 వేల కోట్లు ఖర్చవుతుందంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఉన్నట్టుండి ఇవాళ లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.