అభినందించిన ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు
నాగపూర్ – తాజా రంజీ సీజన్‌లో నాలుగు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు అభినందించారు.
నాగపూర్‌లో విదర్భతో జరుగుతున్న ఈ సీజన్ ఆఖరి రంజీ మ్యాచ్‌ను జగన్ మోహన్ రావు ప్రత్యక్షంగా వీక్షించారు. హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శనను తిలకించి మ్యాచ్ అనంతరం జట్టుతో సమావేశమై వారి ఆటతీరుపై విశ్లేషించారు. గ్రూప్-బిలో టాపర్‌గా ఉన్న విదర్భపై ఎలాగైనా గెలవాలని జట్టును జగన్‌మోహన్ రావు ఉత్తేజ పర్చారు.
ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 84.36 సగటుతో 928 పరుగులు చేసిన తన్మయ్ అగర్వాల్‌ను ప్రశంసించారు. తన్మయ్ త్వరలో టీమిండియాలోకి రావాలని ఆకాంక్షించారు. లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్న తన్మయ్‌కు తన సొంత నిధుల నుంచి రూ.1 లక్ష నగదు బహుమతిని జగన్‌మోహన్ రావు ప్రకటించారు.
ఇక, ఏడు మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ ప్రదర్శనను కూడా కొనియాడారు. ఈ సీజన్‌ను హైదరాబాద్ విజయంతో ముగించాలని, ఆ బాధ్యతను కెప్టెన్ సీవీ మిలింద్, అంతర్జాతీయ పేసర్ మహ్మద్ సిరాజ్ తీసుకోవాలని సూచించారు. జట్టంతా సమష్టిగా రాణించి విజయంతో హైదరాబాద్‌కు రావాలని కోరారు.