డీకేపై కుమార స్వామి కన్నెర్ర
ప్రజ్వల్ వెనుక నేనున్నాననేది అబద్దం
కర్ణాటక – జేడీఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై నిప్పులు చెరిగారు. చిల్లర రాజకీయాలు చేయడం, నిరాధారమైన ఆరోపణలు గుప్పించడం డీకేకు అలవాటేనంటూ మండిపడ్డారు.
ఏది నిజమో ఏది అబద్దమో, ఎవరు సెక్స్ స్కాండల్ పేరుతో బయటకు తీసుకు వచ్చారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు హెచ్ డీ కుమార స్వామి. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. విచిత్రం ఏమిటంటే ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ ల విడుదల వెనుక తన హస్తం ఉందంటూ ఆరోపణలు చేయడం దారుణమన్నారు మాజీ సీఎం.
నేనే నిర్మాతను, నేనే దర్శకుడిని, నేనే నటుడిని..ప్రతిదీ నేనే అంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం తనను మరింత ఆందోళనకు గురి చేసిందన్నారు. రాజకీయాలు ఎవరైనా చేయొచ్చని కానీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేలా ఉండ కూడదని పేర్కొన్నారు హెచ్ డీ కుమార స్వామి.