ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి – రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో నాలుగు రోజులపాటు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఈనెల 30న బుధవారం శ్రీకాకుళంలో రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీసత్యసాయి,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడ రాదన్నారు.అలాగే రేపు విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల,కొత్తవలస మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో వడగాలులు(08) ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు 40-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.
వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 41.1°C, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 41°C, నంద్యాల జిల్లా రుద్రవరంలో 40.6°C, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట 40.5°C, విజయనగరం కొత్తవలస, పల్నాడు జిల్లా నరసారావుపేటలో 40.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు కూర్మనాథ్.