ఏపీలో ప్రాజెక్టులు కళ కళ
తుంగభద్రకు పోటెత్తిన వరద
అమరావతి – భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన జలాశయాలన్నీ నిండి పోయాయి. నిర్దేశించిన నీటి మట్టాలకు దగ్గరగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. గోదావరి బ్యారేజ్ , తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి పోయాయి.
మరో వైపు భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ఇదిలా ఉండగా భద్రాచలం వద్ద నీటి మట్టం 53.2 అడుగులు ఉండగా , పోలవరం వద్ద 13.7 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది.
ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.74 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కూర్మనాథ్ వెల్లడించారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని స్పష్టం చేశారు.
వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని రక్షించేందుకు 6 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో ఉన్నాయని చెప్పారు. నీటి ఉధృతి పెరగడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.