వాయుగుండం ఏపీ జర భద్రం
హెచ్చరించిన వాతావరణ శాఖ
అమరావతి – బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు అగ్నేయంగా 430 కిలోమీటర్లు దూరంలో కేంద్రకృతమై ఉంది. చెన్నైకు ఈశాన్యంగా 480 కిలోమీటర్లు,గోపాలపురం కు దక్షిణంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడుతో పాటు ఏపీలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
రాగల 12 గంటల పాటు ఇది తూర్పు ఈశాన్యం దిశగా కదులుతూ వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి క్రమంగా సముద్రంలోనే బలహీన పడే సూచనలు ఉన్నట్లు హెచ్చరించింది.
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇదిలా ఉండగా వాయుగుండం కారణంగా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన సచివాలయంలో సమీక్ష చేపట్టారు. చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.