NEWSANDHRA PRADESH

ఏపీలో మ‌రోసారి భారీ వ‌ర్షాలు

Share it with your family & friends

ఆర్పీ సిసోడియా హెచ్చ‌రిక

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని హెచ్చ‌రించారు రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా . గురువారం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పలు జిల్లాలలో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు.

అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా, ఈ ప్రభావంతో ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్న అంచనాలు ఉన్నాయని సిసోడియా తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోందని అన్నారు.

ఫలితంగా ఈనెల 24వ తేదీ నుంచి అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని , జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు సిసోడియా.