26న హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం
ముహూర్తం ఖరారు చేసిన ఇండియా కూటమి
జార్ఖండ్ – జార్ఖండ్ లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. తిరిగి మరోసారి హేమంత్ సోరేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొలువు తీరనున్నారు. ఈ మేరకు ప్రజలు ఇండియా కూటమికి పట్టం కట్టారు. బీజేపీ కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు.
నూతన ప్రభుత్వం ఈనెల 26న కొలువు తీరనుంది. జార్ఖండ్ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు హేమంత్ సోరేన్. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో కేసుల కారణంగా జైలు పాలయ్యారు. చివరకు బెయిల్ పై తిరిగి బయటకు వచ్చారు.
సాయంత్రం 4 గంటలకు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ తో సోరేన్ భేటీ కానున్నారు. అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. జేఎంఎం నాయకురాలు కల్పనా సోరేన్ , కాంగ్రెస్ జార్ఖండ్ ఇంఛార్జ్ గులాం అహ్మద్ తో కలిసి జార్ఖండ్ ఎన్నికల్లో కూటమి గెలుపొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కీలక నేతలు హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ, టీఎంసీ చీఫ్ , సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ , ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ హాజరు కానున్నారు.
జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), సీపీఐ-ఎంఎల్‌లతో కూడిన కూటమి 81 మంది సభ్యుల అసెంబ్లీలో మొత్తం 56 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో జేఎంఎం 34 సీట్లు పొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐఎంఎల్ 2 సీట్లు గెల్చుకుంది.