లగచర్ల..హకీంపేట భూసేకరణ నిలిపివేత
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేటలో భూ సేకరణపై స్టే ఇచ్చింది హైకోర్టు. తొలుత ఫార్మా కంపెనీల కోసం భూసేకరణకు శ్రీకారం చుట్టింది. తమ భూములను ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. కొందరిని అరెస్ట్ చేశారు. దీంతో సర్కార్ కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఫార్మా కంపెనీల కోసం కాదని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేసింది. దీని పేరుతో భూసేకరణ మొదలు పెట్టింది. దీనిపై కోర్టు నిలుపుదల చేస్తూ తీర్పు చెప్పింది.
ఆయా గ్రామాల రైతుల వద్దకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, కుడా కమిషనర్ ను ఉరికించారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది అప్పట్లో ఈ ఘటన. ఆ తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున ఆయా గ్రామాలలో మోహరించారు. ఇష్టానుసారం దాడులకు తెగబడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఆపై ఆందోళన చేపట్టారు.
రైతులకు సంకెళ్లు వేస్తూ జైలుకు తరలించడం , ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. చివరకు రైతుల ఆందోళనలు, పోరాటాలు, హెచ్చరికల నేపథ్యంలో బాధితుల తరపున కొందరు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులకు సంబంధించిన భూమి వారి స్వంతమని, వారి అనుమతి లేకుండా భూ సేకరణ చేయకూడదని స్టే ఇచ్చింది.