హోంమంత్రి అనిత వంగలపూడి
అమరావతి – హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉదయం 6. 30 గంటల సమయంలో రెండో బ్లాక్ లోని బ్యాటరీల నుంచి పొగలు రావడాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారన్నారు.
కేవలం 10 నిమిషాలలోపే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని చెప్పారు వంగలపూడి అనిత. జీఏడీ, సీఆర్డీఏ శాఖల అధికారులు షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో కేవలం బ్యాటరీలు మాత్రమే దగ్ధమయ్యాయని, అంతకు మించి ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించినట్టు తెలిపారు.