ఫోన్ లో పరామర్శించిన అనిత వంగలపూడి
అమరావతి – వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఫోన్ లో పరామర్శించారు మంత్రి వంగలపూడి అనిత. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో చెల్లదన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడికి పాల్పడడం ముమ్మాటికీ నేరమేనని అన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడితో మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. దాడి ఘటనపై ఆరా తీశారు.
దౌర్జన్యాలు, రౌడీ చర్యలకు పాల్పడితే రౌడీ షీట్లు తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి. అధికారులు, సామాన్యులపై వైసీపీ నాయకుల దాడి..వారి ఆధిపత్యం, అహంకారానికి నిదర్శనమన్నారు. విధి నిర్వహణలోని అధికారిపై పిడిగుద్దులతో విరుచుకుపడిన ఘటనను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించి, అధికారి గొంతుపైనే కాలేసి తొక్కి, నానా దుర్భాషలాడి పిడిగుద్దులతో విచక్షణరహితంగా దారుణంగా ప్రవర్తించిన వారందరినీ వదలమని హోంమంత్రి పేర్కొన్నారు. మొత్తం 20 మంది వైసీపీ నాయకులు దాడిలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు ఎస్పీ నాయుడు.