హమ్ ఆప్కే హై కౌన్ కు 30 ఏళ్లు
ప్రేమ కావ్యం అనుబంధాల సమ్మేళనం
హైదరాబాద్ – భారతీయ చలన చిత్ర రంగంలో అత్యంత జనాదరణ పొందిన సినిమాలలో హమ్ ఆప్కే హై కౌన్ చిత్రం. సల్మాన్ ఖాన్ , మాధురీ దీక్షిత్ కలిసి నటించిన ఈ మూవీ రికార్డులను బద్దలు కొట్టింది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీనుల విందైన సంగీతం, ఆకట్టుకునే పాటలు, అలరించే సన్నివేశాలు..గుండెల్ని తట్టి లేపే డైలాగులు..ఇలా ప్రతిదీ ఓ ప్రేమ కావ్యమే.
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం, గాన కోకిల లతా మంగేష్కర్ ల గాత్ర మాధుర్యంతో మిళితమైన పాటలన్నీ పలవరించేలా చేశాయి. సరిగ్గా ఇదే రోజు ఆగస్టు 5, 1994లో దేశ వ్యాప్తంగా విడుదలైంది హమ్ ఆప్కే హై కౌన్ చిత్రం. ఇవాల్టితో సరిగ్గా 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్ని ఏళ్లు గడిచినా చెక్కు చెదరకుండా ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు ఈ చిత్రాన్ని. టెక్నాలజీ మారినా పాటలు వెంటాడుతూనే ఉన్నాయి. రాజశ్రీ ప్రొడక్షన్స్ దీనిని నిర్మించారు.
పెళ్లైన జంట..వారి కుటుంబాల మధ్య సంబంధాల కథ. భారతీయ వివాహ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు సూరజ్ బర్జాత్యా. కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసే కథ కావడంతో అందరూ దీనిని ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ సంగీతం అందించాడు. ఇందులో మొత్తం 14 పాటలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా వసూళ్లు సాధించింది. రికార్డు సృష్టించింది హమ్ ఆప్కే హై కౌన్.
భారత దేశంలో ఒక బిలియన్ కంటే ఎక్కువ వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ ఇండియా దీనిని ఆధునిక యుగంలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అభివర్ణించింది. హింస, జుగుస్స, ద్వందర్థాల మధ్య ఊరేగుతున్న తరుణంలో చల్లని పిల్లగాలిలా అల్లుకు పోయింది హమ్ ఆప్కే హై కౌన్ చిత్రం. కథను నడిపించడంలో దర్శకుడు చూపిన ప్రతిభ అద్భుతం. మొత్తంగా ఇది విస్మరించ లేని ప్రేమ కావ్యం.