న్యూ ఇయర్ వేడుకలపై నజర్
గీత దాటితే చర్యలు తప్పవు
హైదరాబాద్ – న్యూ ఇయర్ వేడుకలపై నిఘాను పెంచారు పోలీసులు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ , హోటళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో బార్లు, పబ్ ల లైసెన్స్ లు పరిశీలించారు. మైనర్లను అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని, శబ్ద కాలుష్యం లేకుండా చూడాలని లేకపోతే మూసి వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ గా స్పందించారు. నియమ నిబంధనలు ఎవరైనా సరే పాటించాలని స్పష్టం చేశారు. గీత దాటితే చర్యలు తప్పవని అన్నారు. జీవితం విలువైనదని, వేడుకల్లో పాల్గొనడంలో తప్పు లేదని కానీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రత్యేకించి పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నగర భద్రత అత్యంత ముఖ్యమని అన్నారు. ఇందులో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు సీపీ సీవీ ఆనంద్. మైనర్లను బయటకు వెళ్లకుండా పేరెంట్స్ చూసుకోవాలని స్పష్టం చేశారు. లేకపోతే పేరెంట్స్ కు కూడా కోటింగ్ ఇస్తామన్నారు.