ఆక్రమణలను తొలగించిన హైడ్రా
కూల్చివేతకు స్థానికుల స్వాగతం
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా కూల్చి వేతలకు సంబంధించిన వీడియో, ఫోటోలను పంచుకున్నారు.
హైదరాబాద్‌లోని సరస్సుల నుండి ఆక్రమణలను తొలగించడం జరిగిందని వెల్లడించారు. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట సరస్సుతో ప్రారంభించినట్లు తెలిపారు.
నీటి వనరులను పునరుద్ధరించడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు ఏవీ రంగనాథ్. ఇదిలా ఉండగా రెండు, మూడు రోజుల్లో క్లీనప్ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
ఎర్రకుంట సరస్సు పునరుద్ధరణకు ప్రణాళికలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి స్థానికులు సైతం హైడ్రా చేస్తున్న బృహత్తరమైన ప్రయత్నాలను స్వాగతించారని తెలిపారు ఏవీ రంగనాథ్.
అయితే హైడ్రాపై వస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. తాము ఆక్రమణలకు పాల్పడిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. అంతే తప్ప అన్ని అనుమతులు సరిగా ఉన్న వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు తాము ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.