ఆదేశించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ – హైదరాబాద్ లోని పలు రహదారుల చుట్టు ఆక్రమించుకున్న కబ్జాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వాణికి 71 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల్లో అధికభాగం పార్కులు, రహదారుల కబ్జాలే ఉన్నాయని.. లే ఔట్ ప్రకారం రహదారులుండేలా చూడాలని సూచించారు. ఎవరు ఆక్రమణలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.
దశాబ్దం క్రితం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఫిర్యాదు దారులకు కూడా చూపించి.. సమస్య పరిష్కారానికి చర్యలు సూచించారు. ఫిర్యాదుదారులు సంప్రదించాల్సిన హైడ్రా అధికారులను పరిచయం చేశారు. వారు విచారణకు వచ్చిన సమయంలో అన్ని వివరాలు అందజేయాలని సూచించారు.
ఒకప్పడు సెప్టిక్ ట్యాంకుల కోసం కేటాయించిన స్థలాలను.. ఇప్పుడు వినియోగంలో లేవని.. వాటిని ప్రజావసరాలకు కేటాయించిన స్థలంగానే పరిగణించాలని స్పష్టం చేశారు ఏవీ రంగనాథ్… ఎవరైనా కబ్జాలుచేస్తే వెంటనే వాటిని తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.