శాఖల మధ్య సమన్వయంతోనే సాధ్యం
హైదరాబాద్ – ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నివారణకు విద్యుత్, ఫైర్, ఇండస్ట్రీ ఇలా ఎవరికి వారు కాకుండా..ఇందుకు ఉద్దేశించిన వ్యవస్థలన్నీ ఒక ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ వినియోగంలో ఉన్న లోపాలవల్లే ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న వేళ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. అందరిలో అవగాహన పెంచడం అవసరం ఉందన్నారు. భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారో లేదో పరిశీలించడానికి సంబంధిత విభాగాలకు చెందిన నిపుణుల బృందంతో ఒక నోడల్ ఏజెన్సీని రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
విద్యుత్ వైరింగ్, ఎర్తింగ్, నాణ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలను వినియోగిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలే కాకుండా అపార్టుమెంట్లు, కార్యాలయాలు, నివాసాలలో కూడా భద్రతా ప్రమాణాలు పాటించేలా ఈ నోడల్ ఏజెన్సీ చూడాలన్నారు. దుర్ఘటన జరిగిన తర్వాత పోస్టుమార్టం చేసేలా కాకుండా.. అందుకు ఆస్కారం లేని విధంగా చర్యలు తీసుకోవాలని.. అందుకే ఈ సదస్సు పెట్టామన్నారు. హైడ్రాకు చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు విభాగం ఈ సమన్వయాన్ని తీసుకు రావాలని సూచించారు.
డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజగోపాల్, బాయిలర్స్ డిపార్టుమెంట్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ భీమారావు, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్, సినర్జీ కన్సల్టెంట్ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ కన్సల్టెంట్ కృష్ణ రమేష్ మాట్లాడారు. హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకులు పాపయ్య, ఎస్‌పీ సుదర్శన్, డిప్యూటీ కలెక్టర్ సుధ, ఆర్ ఎఫ్‌వో జయప్రకాశ్, డీఎఫ్‌వోలు యజ్ఞనారాయణ, గౌతం, ఎస్ ఎఫ్‌వోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.