చిత్రపురి కాలనీలో 225 విల్లాల ఓనర్లకు షాక్
హైదరాబాద్ – హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కులు, ఆక్రమణదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తాజాగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూలగొట్టారు. పూర్తిగా నేల మట్టం చేయడంతో రాజధాని నగరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
తాను ప్రైవేట్ భూమి లోనే నిర్మాణం చేపట్టానని, ఆక్రమణకు పాల్పడలేదని అక్కినేని నాగార్జున తెలిపారు. ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించి కోర్టు స్టే విధించిందని, కేసు కోర్టులో ఉండగా ఎలా ధ్వంసం చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు నాగార్జున కోర్టును ఆశ్రయించారు. దీంతో వెంటనే కూల్చివేతలను ఆపాలని కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా కోర్టు ఓ వైపు స్టే లు జారీ చేసినా మరో వైపు హైడ్రా ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని మణికొండ చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారుల నోటీసులు జారీ చేశారు.
జీవో 658కి విరుద్దంగా 225 ROW హౌస్ల నిర్మాణాలు.. జీ+1కు అనుమతులు పొంది జీ+2 నిర్మాణాలు చేపట్టారని ఇందులో పేర్కొన్నారు. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించారు మున్సిపల్ కమిషనర్.. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటికి రూ. 50 కోట్ల నష్టం జరిగిందంటూ ఫిర్యాదు రావడంతో నోటీసులు జారీ చేశారు.