హైడ్రా ప్రజావాణికి 63 ఫిర్యాదులు
హైదరాబాద్ – తండ్రులు అమ్మారు.. తనయులు వచ్చి పాసు పుస్తకాలు తమ పేరిట సృష్టించుకుని పాత లే ఔట్లను చెరిపేసి పంట పొలాలుగా సాగు చేసేస్తున్నారని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులందాయి. సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయి. ఇందులో పాతలేఔట్ల ఆక్రమణలే ఎక్కువగా ఉన్నాయి. రహదారులు, పార్కులు కూడా ఉన్నాయని.. వీటిని కాపాడాలని పలువురు కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కోరారు.
లే ఔట్లలో రహదారులను కబ్జాచేయడం, పార్కులు కలిపేయడం వంటివి జరుగుతున్నాయని వాపోయారు. అలాగే మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేస్తున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పందన ఉండటం లేదని ఆరోపించారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలలో కూడా హైడ్రా ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టామన్నారు ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే విడిచి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కబ్జా కాకుండా కాపాడటమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.