కొనుగోలు చేయొద్దన్న హైడ్రా కమిషనర్
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ సంచలన ప్రకటన చేశారు. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని సూచించారు. నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని.. వీటిని కొన్న వారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేదం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మిగూడ విలేజ్ సర్వే నంబరు 50 లోని 1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.
పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018లో పొందు పరిచిన విధంగా ఎక్కడా ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి లేదనిపేర్కొన్నారు.
ఫార్మ్ ల్యాండ్ అంటే 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని చెప్పారు. ఈ మేరకు ఫార్మ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
జీవో నంబరు 131 ప్రకారం 31.8.2020 తర్వాత వెలసిన అనాథరైజ్డ్ లే ఔట్లలో ప్లాట్లలో ఇల్లు నిర్మించడానికి ఎలాంటి అనుముతులు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు.
నగర పరిధిలో హెచ్ ఎండీఏ నిబంధనల ప్రకారం 10 శాతం పార్కులకోసం, 30 శాతం రహదారుల కోసం స్థలాలను కేటాయించాల్సి ఉన్నా ఎక్కడా ఆ నిబంధనలను కూడా పాటించడం లేదని ఫిర్యాదుదారులు హైడ్రాకు నివేదించారు.