NEWSTELANGANA

అక్ర‌మ నిర్మాణాలు కూల్చి వేశాం – హైడ్రా

Share it with your family & friends

అధికారికంగా ప్ర‌క‌టించిన ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ న‌గ‌రంలో కూల్చి వేత‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆరోప‌ణ‌లు మ‌రో వైపు విమ‌ర్శ‌లు వస్తున్నా ఎక్క‌డా లెక్క చేయ‌డం లేదు హైడ్రా సంస్థ క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఆదివారం ఎలాంటి ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండానే నిర్మాణాల‌ను కూల్చి వేయ‌డం ప‌ట్ల బాధితులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అక్ర‌మ నిర్మాణాలు గుర్తించ‌డం జ‌రిగింద‌ని, అందుకే కూల్చామ‌ని, ఇందులో ఎలాంటి రాజ‌కీయ దురుద్దేశాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

అమీన్‌పూర్‌, పటేల్‌గూడ, కూకట్‌పల్లి కూల్చివేతలపై క‌మిష‌న‌ర్ స్పందించారు. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.

నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఉంద‌ని , ఇందులో అక్రమంగా నిర్మించిన షెడ్లను గుర్తించడం జ‌రిగింద‌ని చెప్పారు ఏవీ రంగ‌నాథ్. బాలనగర్‌ (మ) పరిధిలో 16 అక్రమ నిర్మాణాలు కూల్చామ‌ని, 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామ‌ని వెల్ల‌డించారు.

పటేల్‌గూడ్‌, కృష్ణారెడ్డిపేటలో ఆక్రమణలు తొలగించి 4 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించామ‌ని స్ప‌ష్టం చేశారు ఏవీ రంగ‌నాథ్. ఈ ఆక్రమణలను తొలగించడం ద్వారా 8 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్సీ క‌విత కు చెందిన బినామీ సృజ‌న్ రెడ్డికి చెందిన నిర్మాణాలు ఉన్న‌ట్లు స‌మాచారం.