హైడ్రాపై దుష్ప్రచారం కమిషనర్ ఆగ్రహం
పేదలు..మధ్యతరగతి ఆస్తుల ధ్వంసం అబద్దం
హైదరాబాద్ – హైడ్రా కావాలని పేదలు, సామాన్యులను ఇళ్లను, భవనాలను కూల్చడం లేదని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తమపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు . ఇది మంచి పద్దతి కాదని అన్నారు.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ , డిజిటల్ మీడియాలోనే ఎక్కువగా హైడ్రాను బద్నాం చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కావాలని ఎవరినీ టార్గెట్ చేయడం లేదని పేర్కొన్నారు ఏవీ రంగనాథ్.
హైదరాబాద్ లో కొందరు ఆక్రమణదారులు హైడ్రా పేరుతో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం తమకు వచ్చిందన్నారు. ఇక అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వెల్లడించారు .
అయితే ఆక్రమణదారులు, బడా బాబులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో సర్కార్ స్థలాలను ఆక్రమిస్తున్నారంటూ ఆరోపించారు. ఇదే సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కనే ఉన్న గుడిసెలను తాము కూల్చలేదని ఆ విషయం గుర్తించాలని కోరారు హైడ్రా కమిషనర్.
కొందరు హైడ్రా వచ్చిన సమయంలో పెట్రోల్, డీజిల్ పోసుకుంటామని హల్ చల్ చేస్తున్నారని మండిపడ్డారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉంటున్న వారికి ముందస్తు సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. కొందరు దీనిని లైట్ గా తీసుకున్నారని , వారిని ఖాళీ చేశాకనే కూల్చి వేతలు ప్రారంభించామని పేర్కొన్నారు ఏవీ రంగనాథ్. హైడ్రాను బూచీగా చూపించి బుచ్చమ్మను భయభ్రాంతులకు గురి చేశారంటూ వాపోయారు. హైడ్రా పెద్దోళ్లకు సపోర్ట్ చేయదని, పేదలు, సామాన్యులకు అండగా ఉంటుందన్నారు.