మట్టి నింపుతున్న వారిపై చర్యలకు ఆదేశం
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జూలు విదిల్చారు. నగరంలో కబ్జాలకు గురైన చెరువులను గుర్తించే పనిలో పడ్డారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించారు. ఇదే సమయంలో గంగారాం చెరువును స్వయంగా పరిశీలించారు. అక్కడ యధేశ్చగా, ఎలాంటి అనుమతి పొందకుండా మట్టిని తవ్వుతున్నారని , బయటకు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్ లో ఉన్న ఈ చెరువును తనిఖీ చేశారు. కార్పొరేటర్ మంజుల, హైడ్రా అధికారులు, ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు. గంగరాం చెరువులో డంపింగ్ జరుగుతున్నా..హైడ్రా కట్టడి చేయలేక పోతోందని స్థానిక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. గంగారం చెరువులో డంపింగ్ ఎవరు చేస్తున్నారు..? డంపింగ్ చేసిన వారిపై కేసులు పెట్టారా..? తదితర వివరాలను స్థానిక ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తర్వాత మీడియాతో కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. 2023 డిసెంబరులో డంపింగ్ చేసిన వారిపై ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టగా.. తాజాగా హైడ్రా డీఆర్ ఎఫ్ లేక్ ప్రొటెక్షన్ గార్డులు కూడా చందానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని కమిషనర్ చెప్పారు. చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలు ఆగాలంటే.. హైడ్రా పోలీసు స్టేషన్ అవసరమన్నారు. హైడ్రా పోలీసు స్టేషన్ వచ్చే వరకూ స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు పెడతామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల్లో డంపింగ్ జరగకుండా చూస్తామన్నారు. ప్రతి చెరువు దగ్గర హైడ్రా లేక్ ప్రొటెక్షన్ కమిటీ గార్డులుంటారని 24 గంటలూ తనిఖీలుంటాయని చెప్పారు.
అనంతరం అయ్యప్ప సొసైటీ బొరబండకి చేరువలో వున్న సున్నం చెరువును కూడా హైడ్రా కమిషనర్ సందర్శించారు. అక్కడ చెరువు పునరుద్ధరణ పనుల ఆటంకాలపై సమీక్షించారు. వచ్చే వర్షాకాలానికి చెరువు అభివృద్ధి పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు కమిషనర్.