వార్నింగ్ ఇచ్చిన ఏవీ రంగనాథ్
హైదరాబాద్ – చెరువుల్లో మట్టి పోసినా లేదా త్రవ్వినా చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. శనివారం బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, కాంట్రాక్టర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇందులో కేసులు బుక్ అవుతాయన్నారు. చెరువుల వద్ద కూడా 24 గంటలూ నిఘా ఉందని పేర్కొన్నారు.చెరువుల్లో మట్టిపోసి నింపుతున్న వారి సమాచారాన్ని ఇవ్వాలని నగర ప్రజలను కోరారు కమిషనర్ ఏవీ రంగనాథ్.
ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబరు 9000113667 కేటాయించిందని తెలిపారు. హైడ్రా ట్విట్టర్ అకౌంట్ ద్వరా కూడా ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని సూచించారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ఈ క్రతువులో చేతులు కలపాలని కోరారు.
కాలుష్యం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం.. ఇలా కారణాలేమైనా అసాధారణమైన వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం వరదముప్పు తప్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా మేధోమధనం చేసిందన్నారు రంగనాథ్.