సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్
అమరావతి – తనను కావాలని ఇరికించే కుట్ర కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్. కొన్ని శక్తులు తనను ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పగించిన పదవికి న్యాయం చేశానే తప్పా ఏనాడూ రూల్స్ అతిక్రమించ లేదని స్పష్టం చేశారు. తనపై ఎన్ని కమిటీలు వేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇలాంటి వాటిని తాను ఎన్నో చూశానని అన్నారు.
తనపై వచ్చిన అసత్య కథనాలు, ఆరోపణలను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. పీవీ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం అనేది పూర్తిగా గౌరవ హైకోర్టు తీర్పునకు కట్టుబడి, వారు సూచించిన విధి విధానాలను అనుసరించి చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో ఒక్క పైసా కూడా పక్కదారి పట్టిన దాఖలాలు లేవన్నారు.
ఈ ప్రక్రియలో సిఐ డి పాత్ర పరిమితంగా ఉంటుందన్నారు. జిల్లా న్యాయ సహాయ సంస్థ ఆధ్వర్యంలో, రెవెన్యూ , పోలీసు శాఖల జిల్లా అధికారులు భాగస్వాములుగా ఏర్పడిన కమిటీలు స్క్రూటినీ చేసి ఆమోదించిన వారికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేరుగా చెల్లింపులు చేసిందని స్పష్టం చేవారు పీవీ సునీల్ కుమార్.
తనపై లేనిపోని ఆరోపణలు చేసే వారిపై తాను చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళతానని హెచ్చరించారు.