లడ్డూ వివాదంపై పీఎం..సీజేఐకి లేఖ రాస్తా
స్పష్టం చేసిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై తీవ్రంగా స్పందించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. పాలనా పరంగా వైఫల్యాలను కప్పి పుచ్చు కోవడంలో భాగంగానే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ప్రసాదం తయారీ విషయాన్ని రాద్దాంతం చేశారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
తమ హయాంలో టీటీడీ ప్రసాదాల తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని తాను కోరుతున్నానని చెప్పారు.
ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందన్నారు. ఇది పనిగట్టుకుని తనను, తన పార్టీని బద్నాం చేసేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు.
ఇందుకు సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని, వాస్తవాలను ప్రజలకు తెలియ చేయాలని కోరుతూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి, భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు లేఖలు రాయనున్నట్లు ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి.