ఇళయరాజా బయో పిక్ పోస్టర్ రిలీజ్
విడుదల చేసిన రాజా..హీరో ధనుష్
తమిళనాడు – భారతీయ సినీ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు పొందారు తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆయన వందలాది విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించారు. సంగీతంలో మాస్ట్రోగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు. ఆయన చేయని ప్రయోగం అంటూ ఏదీ లేదు.
ఇదిలా ఉండగా ఇళయారాజా జీవిత ప్రస్థానంపై ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ పేరుతో ఇళయరాజా బయో పిక్చర్ రూపుదిద్దుకుంది. ఇందుకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఇళయరాజా బయో పిక్ లో ప్రముఖ నటుడు ధనుష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.
తన జీవిత కాలంలో 1,000కి పైగా చిత్రాలకు 7,000లకు పైగా పాటలకు ప్రాణం పోశారు ఇళయరాజా. ఆయన సంగీత దర్శకుడే కాదు మంచి గాయకుడు కూడా. ఎక్కువ పాటలు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాడించారు. ఆయనను సినీ రంగంలోకి తీసుకు వచ్చింది కూడా బాలునే కావడం విశేషం.
ఇళయ రాజా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన 20,000లకు పైగా వివిధ దేశాలలో కచేరీలు ఇచ్చారు. ఇక ఇళయరాజా జీవిత చరిత్రను కన్నెక్ట్ మీడియా నిర్మించింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రిలీజ్ చేసిన ఈ పోస్టర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.