ఆ గాత్రం చిరస్మరణీయం..అజరామరం
మరణం లేని మహా గాయకుడు ఎస్పీబీ
హైదరాబాద్ – ఎస్పీబీ ఈ మూడు అక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్లాది మందిని తన గాత్రంతో గుండెల్ని మీటిన మహానుభావుడు. మరిచి పోలేని గాయకుడు. ఒక మనిషి తన జీవిత కాలంలో ఇన్ని రకాల పాత్రలు చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. తను సింగర్ అంతేనా డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు, సంగీత దర్శకుడు, ప్రయోక్త ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన వక్త కూడా. ఎదుటి వారిని మైమరిపించేలా పాటలు పాడడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా సినీ సంగీత జగత్తులో తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్న శ్రీపతి పండిరాధ్యుల బాల సుబ్రమణ్యం గురించి ఏమని చెప్పాలి. కళ్లల్లో నీళ్లు తప్ప..గుండెల్లో బాధ తప్ప.
తను సాగించిన సంగీత సినీ ప్రస్థానం ఇంకా అలరిస్తూనే ఉన్నది. ఇంకా గుండెలను తాకుతూనే ఉన్నది. మైమరిచి పోయేలా ఓల లాడిస్తోంది. కళ్లల్లోని కనుపాపలా కంటికి రెప్పలా పాటలతో ఓదార్పు ఇస్తూనే ఉంది ఎస్పీబీ గాత్రం. సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ 25న ఇక సెలవంటూ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లి పోయారు గాన గాంధర్వుడు. ఇక పాడే సమయం అయి పోయిందంటూ..ఇంకెంత కాలం ఇక్కడ ఉండనంటూ భారంగా మనల్ని ఒంటరి వాళ్లను చేసి వెళ్లి పోయాడు. ఇంతలా మనిషి కదిలిస్తాడని ఎవరూ అనుకోలేదు. అది పాటకు ఉన్న శక్తి . అంతే కాదు ఆ మాధుర్యమైన, అమృతంతో కలిసిన గొంతుకు మాత్రమే ఉందని కోట్లాది మందికి అర్థమై పోయింది.
అందుకే బాలు తెలుగు వాడు కానే కాదని అందరి వాడని, భారతీయ ఆత్మ గీతం అంటూ పేర్కొన్నారు. లేలేత హృదయాలను పాటలతో అల్లుకునేలా చేసిన వాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ భాషలోనూ తన గాత్రంతో పాటై అల్లుకు పోయాడు. విడదీయలేని ఆత్మ బంధాన్ని పెన వేసుకు పోయాడు గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తను ఏ పాట పాడినా దానికి ప్రాణం పోశాడు. అందులో లీనం కావడమే కాదు మనల్ని కూడా తనతో పాటు ప్రయాణం చేసేలా చేశాడు. అందుకే ఆయన స్వరాభిషేకం ప్రతి ఇంటా ప్రాతః స్మరణీయమై వెలుగొందుతోంది. గుండెల్ని కదుపుతోంది. ఎస్పీబీ గాత్ర దానంతో ఎందరో వెండి తెరను ఏలారు.
మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ప్రారంభమైన కెరీర్ చివరి ఊపిరి ఉన్నంత వరకు పాడుతూనే..పాడుకుంటూనే ఉన్నాడు. ఎస్పీ బాల సుబ్రమణ్యంను ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి. అవి చెప్పు కోవడానికి మాత్రమే..కానీ ఆ గాత్రంతో ఒక్కసారి పరిచయం చేసుకుంటే ఇక బతుకంతా ఆనందమే అనిపించక మనదు. బాలు మన కాలంలో ఉన్నందుకు..మన వాడైనందుకు ..స్మరించు కోకుండా ఉండలేం. బాలూ సర్ నువ్వు లేవని ఎవరన్నారు..లోకం ఉన్నంత వరకు..సూర్య చంద్రులు ఉన్నంత కాలం నువ్వు పాటై పలకరిస్తూనే ఉంటావు. గుండెల్ని తడుముతూనే ఉంటావు..నువ్వు మరణం లేని మహా గాయకుడివి..సర్.