తిరుమల విజన్ 2047 కు ఆహ్వానం
ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలన్న ఈవో
తిరుమల – స్వర్ణాంధ్ర విజన్ – 2047కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్ – 2047 ను టీటీడీ ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం ఆర్ఎఫ్‌పీని విడుదల చేసినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు.
ఇటీవల తిరుమలలో జరిగిన సమావేశంలో టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికతతో సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ దిశగా ప్లాన్ తయారు చేయాలని టీటీడీ పాలక మండలిని ఆదేశించారు. తిరుమల ఆధ్యాత్మికం, పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందు చూపుతో భక్తులకు సౌకర్యాలు, వసతిని మెరుగు పర్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధనలను అనుసరిస్తూ తిరుమల పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వతమైన వ్యూహాలను అమలు చేయడం. ఉత్తమమైన ప్రణాళికలు, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం. ప్రపంచ వ్యాప్తంగా తిరుమలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు టీటీడీ ప్రయత్నం చేయడమే ఈ విజన్ లక్ష్యమని స్పష్టం చేశారు ఈవో తిరుమల రావు.
తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుండి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. తిరుమల పట్టణ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు.
తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయడం. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం. తిరుమలలోని పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగు పరచడానికి భవిష్యత్ వ్యూహాలను రూపొందించడం జరుగుతుందన్నారు.
వివరణాత్మక నివేదికలు( DPR)లు తయారు చేయడం జరుగుతుందన్నారు. మౌలిక సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళికలు ఇందులో ఉంటాయన్నారు.
మూడు వారాల్లోగా ఆసక్తి గల ఏజెన్సీల నుండి తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా కోరడమైనది. ఇలాంటి భారీస్థాయి పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఏజెన్సీలకు ముందస్తు అనుభవం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు ఈవో.
వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆధునిక పట్టణ ప్రణాళికలను మిళితం చేసే ఒక బృహుత్తర భవిష్య ప్రణాళికలను రూపొందించడం. తిరుమలలో రాబోవు తరాల్లో మరింతగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే ప్రణాళిక లక్ష్యమని పేర్కొన్నారు.