కాంగ్రెస్ కు షాక్ ఐటీ నోటీస్
రూ. 135 కోట్లు రికవరీ
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల వేళ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఏఐసీసీకి. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన లావాదేవీలను స్తంభింప చేసింది కేంద్ర ఆదాయపు పన్ను శాఖ. సమకూరిన డబ్బులకు గాను ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదంటూ పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. తమకు రవాణా ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేశారంటూ వాపోయారు.
తాజాగా మరోసారి షాక్ ఇచ్చింది ఐటీ. కాంగ్రెస్ పార్టీకి తిరిగి మరోసారి నోటీసు జారీ చేసింది. శుక్రవారం పార్టీకి అందజేసిన నోటీసులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పార్టీ ఖాతాలలో ఉన్న రూ. 1700 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిందేనంటూ పేర్కొంది. లేకపోతే వాటిని జప్తు చేయాల్సి ఉంటుందని కుండ బద్దలు కొట్టింది.
ఈ డబ్బులు ఎవరెవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వారి వివరాలు కూడా పూర్తిగా కావాలని కోరింది. ఈ మొత్తం డబ్బులకు సంబంధించి పన్నులు ఎందుకు కట్టలేదంటూ కూడా ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఆయా ఖాతాలకు సంబంధించి రూ. 135 కోట్లు రికవరీ చేసినట్లు వెల్లడించింది ఐటీ శాఖ.