కాంగ్రెస్ పార్టీకి ‘గాలి’ మద్దతు
రాజ్యసభ ఎన్నికల్లో సపోర్ట్
కర్ణాటక – రాష్ట్రంలో మోస్ట్ పాపులర్ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు గాలి జనార్దన్ రెడ్డి. ఆయన ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అంతకు ముందు ఆయన భారతీయ జనతా పార్టీతో సత్ సంబంధాలు నెరుపుతూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఆ పార్టీకి దూరమయ్యారు. వేల కోట్ల సంపద కలిగిన బిజినెస్ మాగ్నేట్ గా గుర్తింపు పొందారు.
తాజాగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో కాషాయ పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు. కేపీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికల్లో రథ సారథిగా ముందుండి నడిపించారు. కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. ఆ పార్టీని పవర్ లోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో భావ సారూప్యత కలిగిన పార్టీలను, నేతలను కలిపేలా చేయడంలో కృషి చేశారు డీకే శివకుమార్.
తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కొలువు తీరిన సిద్దరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు స్వతంత్ర ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి. సోమవారం ఆయన సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలుసుకున్నారు.