కజాన్ లో కలిసిన కత్తులు
రష్యా..ఇండియా..చైనా
రష్యా – యావత్ ప్రపంచం నివ్వెర పోయేలా బ్రిక్స్ సదస్సు కొనసాగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సారథ్యంలో కజాన్ లో కీలకమైన సదస్సు ప్రారంభమైంది. ఈ ముఖ్యమైన సమావేశం గురించి ప్రతి ఒక్క దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. దీనికి ప్రధాన కారణం గత కొన్నేళ్లుగా భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన. దీనిని నివారించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు భారత్ కు స్నేహితుడిగా భావించే రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్.
ఆయన భారత్, చైనా దేశాలను కలిపేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. ఇందుకు బ్రిక్స్ వేదికగా నిలిచింది. ఇందుకు సంబంధించి అరుదైన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిన్నటి దాకా తమకు ఎదురే లేదని భావిస్తూ వచ్చిన పెద్దన్న అమెరికా వెన్నులో వణుకు పుట్టించేలా చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా చీఫ్ పుతిన్, భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
పుతిన్ చేసిన దౌత్యం ఫలించింది. బ్రిక్స్ వేదికగా భారత్, చైనా దేశాలు సామరస్య పూర్వకంగా కలిసి సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో జిన్ పింగ్, మోడీ, పుతిన్ లు సంతోషంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ముగ్గురి కలయిక ప్రపంచాన్ని మరింత ఉత్కంఠను రేపేలా చేసింది.