సుస్థిర అభివృద్దిపై భారత్ ఫోకస్ – మోడీ
జి20 సదస్సులో ప్రధానమంత్రి
బ్రెజిల్ – బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన కీలకమైన జి20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆయనతో పాటు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్. ఈ సందర్బంగా ప్రధానమంత్రి ఆయా దేశాలకు చెందిన దేశాధినేతలు, ప్రధానమంత్రులతో భేటీ అయ్యారు.
మరో వైపు జై శంకర్ చైనా విదేశాంగ శాఖ మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్ర మోడీ ఇటలీ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ , సౌతాఫ్రికా చీఫ్ తో పాటు సింగపూర్ దేశ అధ్యక్షుడితో ములాఖత్ అయ్యారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచం ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతోందని, శాంతియుత ప్రయత్నం చేయాలని సూచించారు. భారత్ ఇందుకోసం అలుపెరుగని రీతిలో కృషి చేస్తోందని చెప్పారు నరేంద్ర మోడీ.
సుస్థిర అభివృద్ధి ఎజెండా పట్ల భారతదేశం దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించారు. గత దశాబ్దంలో, భారతదేశం గృహ నిర్మాణం, నీటి వనరులు, శక్తి , పారిశుద్ధ్యం వంటి రంగాలలో అనేక కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు ప్రధాని. ఇవి మరింత స్థిరమైన భవిష్యత్తుకు దోహద పడ్డాయని అన్నారు.
ఈ సందర్బంగా సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రయత్నానికి తోడ్పాటు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు మోడీ.