హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ
ప్రకటించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
దుబాయ్ – ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లదని పేర్కొంది. భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ లన్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదంటూ స్పష్టం చేసింది బీసీసీఐ.
పూర్తి సెక్యూరిటీ కల్పిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసినా మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. తమకు ఆట కంటే ఆటగాళ్ల జీవితాలు ముఖ్యమని బీసీసీఐ కార్యదర్శి జే షాకు స్పష్టం చేసింది. ఈ మేరకు లిఖత పూర్వకంగా పేర్కొంది. పీసీబీ బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో అసలు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా లేదా అన్న అనుమానం నెలకొంది.
దీనిపై సమావేశమైన ఐసీసీ కుండ బద్దలు కొట్టింది. టీమిండియా భద్రత ముఖ్యం కావడంతో పాకిస్తాన్ లో కాకుండా ఇతర ప్రాంతాలలో నిర్వహించాలని పీసీబీకి స్పష్టం చేసింది. లేక పోతే ఇండియా, ఇతర దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దిగి వచ్చింది. చివరకు హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించేందుకు ఓకే చెప్పింది.