20 ఏళ్ల సమస్యకు రంగనాథ్ పరిష్కారం
హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామంలోని శ్రీ రంగాపురం కాలనీలో 45 అడుగుల ప్రధాన రహదారిపై అడ్డంగా కట్టిన ప్రహరీని హైడ్రా ఈ నెల 19న తొలగించింది. ఈ సందర్బంగా యాపిల్ ఎవెన్యూ, శ్రీరంగాపురం, సాయినాథ్‌కాలనీ, సుందరయ్య కాలనీ, శ్రీ శ్రీనివాస కాలనీ, ఇందిరమ్మ కాలనీ 1, ఇందిరమ్మ కాలనీ 2 నివాసితులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిశారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. శాలువాతో తనను ఘనంగా సన్మానించారు. హైడ్రా వల్ల ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. దీనికంతటికీ తనే కారణమని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో హైడ్రాను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సామాన్యులకు అండగా ఉంటున్న ప్రభుత్వానికి, హైడ్రాకు దన్యవాదాలు తెలిపారు. 7 కాలనీలకు దారి చూపిన ఘనత హైడ్రాదని ఆయా కాలనీవాసులు అభినందించారు. ప్రధాన రహదారి మూత పడడంతో అంబులెన్సులు, స్కూల్ బస్సులు రాలేని పరిస్థితుల్లో 20 ఏళ్లుగా అవస్థలు పడ్డామని వాపోయారు. ఇప్పుడు హైడ్రా చర్యలతో ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించారని ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.