80 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు
కోల్ కతా – ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఐపీఎల్ 2025 టోర్నీ 18వ సీజన్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడితే ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలుపొందింది. తాజాగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. కేవలం 120 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా నిరాశ పరిచారు. కేకేఆర్ బౌలర్ల దెబ్బకు ఎస్ ఆర్ హెచ్ విలవిల లాడింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 200 రన్స్ చేసింది.
201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు పూర్తిగా నిరాశ పరిచారు. అంతకు ముందు కేకేఆర్ జట్టు తరపున వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ హాఫ్ సెంచరీలతో రెచ్చి పోయారు. అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా సమిష్టి కృషితో రాణించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్ పూర్తిగా చతికిలపడింది. 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఎస్ ఆర్ హెచ్ లో క్లాసెన్ 33 రన్స్ చేయగా కమిందు మెండీస్ 27 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు తప్పా ఏ ఒక్కరు కోల్ కతా బౌలర్లను ఎదుర్కోలేక పోయారు.