అదరగొట్టిన రోహిత్, సూర్య
ముంబై – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది ముంబై ఇండియన్స్. చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హ్యాట్రిక్ గెలుపును నమోదు చేసింది. ఈ టోర్నీలో సీఎస్కేకు ఇది వరుసగా ఆరో అపజయం కావడం గమనార్హం. సీజన్ లో ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత పుంజుకుంది. మాజీ స్కిప్పర్ రోహిత్ శర్మ 45 బంతులు ఎదుర్కొని 76 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 6 భారీ సిక్స్ లు ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్ కేవలం 30 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 68 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 5 సిక్స్ లు ఉన్నాయి. దీంతో చెన్నై నిర్దేశించిన 177 రన్స్ ను ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే పని కానిచ్చేసింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, శివమ్ దూబే సూపర్ షో చేశారు. జడేజా 35 బంతులు ఎదుర్కొని 53 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. శివమ్ దూబే దూకుడు ప్రదర్శించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 2 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. ఇక ఇదే టోర్నీలో తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. మరోసారి జరిగిన కీలక పోరులో గ్రాండ్ విక్టరీ నమోదు చేసి ప్రతీకారం తీర్చుకుంది హార్దిక్ పాండ్యా జట్టు.