చెలరేగిన అయ్యర్ మెరిసిన శశాంక్
ఐపీఎల్ 2025 లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ తడబడింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి వచ్చిన విజయకుమార్ జీటి పతనాన్ని శాసించాడు. తను 19 ఓవర్ వేస్తే ఆఖరి ఓవర్ లో వచ్చిన అర్ష్ దీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. జోష్ బట్లర్ జోష్ పెంచినా, రూథర్ ఫోర్డ్ సూపర్ గా ఆడినా చివరకు పంజాబ్ బౌలర్ల దెబ్బకు విల విలలాడింది. 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శ్రేయస్ అయ్యర్ మరోసారి తన నాయకత్వ ప్రతిభను చాటాడు.
అంతకు ముందు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. భారీ స్కోర్ సాధించింది. 5 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 243 రన్స్ చేసింది. స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ 97 రన్స్ తో చెలరేగి పోయాడు. 42 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 9 సిక్సర్లు కొట్టాడు. యంగ్ర క్రికెటర్ శశాంక్ దుమ్ము రేపాడు. 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 16 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. ఈ యంగ్ క్రికెటర్ ఆఖరి 20వ ఓవర్ లో ఏకంగా 5 ఫోర్లు బాదాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం ఫోర్లు, సిక్సర్లతో దద్దరిల్లి పోయింది.