46 మంది ఆటగాళ్లకు రూ. 558.5 కోట్లు
ముగిసిన టాటా ఐపీఎల్ 2025
ముంబై – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2025కి సంబంధించి ఫ్రాంచైజీలు ఈసారి భారీ ఎత్తున ఆటగాళ్లను తీసుకునే ప్రయత్నం చేశాయి. మొత్తం 10 ఐపీఎల్ జట్లు రూ. 585.5 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 46 మంది ఆటగాళ్లను తిరిగి తీసుకున్నాయి.
అక్టోబర్ 31తో వేలం పాట ముగిసింది. ప్రతి జట్టుకు 25 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఏర్పాటు చేయడానికి మెగా వేలంలో రూ. 120 కోట్ల మొత్తం పరిమితి అందుబాటులో ఉండేలా చేసింది. ఫ్రాంచైజీలు గరిష్టంగా ఐదు అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు ఆరుగురు దేశీయ ఆటగాళ్లను (రిటెన్షన్/రైట్ టు మ్యాచ్) నిలుపుకోవడానికి అనుమతించబడ్డాయి. ఇద్దరు అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లను తీసుకునేందుకు ఛాన్స్ ఉంది.
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ , ప్రారంభ సీజన్ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ పూర్తి రిటెన్షన్‌లను ఎంచుకున్నాయి, ఒక్కొక్క ఫ్రాంచైజ్ ఆరుగురు ఆటగాళ్లను సురక్షితంగా ఉంచుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ఆటగాళ్లను అట్టి పెట్టుకున్నాయి.
అదే సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ (PBKS) వరుసగా నలుగురు, ముగ్గురు , ఇద్దరు ఆటగాళ్లను ఉంచుకున్నాయి . ఇక జట్ల పరంగా చూస్తే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరనా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీని ఉంచుకుంది. ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంచైజ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ ను తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజ్ రషీద్ ఖాన్, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్ ను ఉంచుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్ లను ఎంపిక చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజ్ నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోనిని ఉంచుకుంది.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను ఉంచుకోగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ శశాంక్ సింగ్ , ప్రభ్ సిమ్రాన్ సింగ్ లను తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, సందీప్ శర్మ లను ఎంపిక చేసుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్ లను ఉంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ లను ఎంపిక చేసింది.