ఆరు పరుగుల తేడాతో చెన్నై లాస్
గౌహతి – ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఎట్టకేలకు బోణీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఎప్పటిలాగే సంజూ శాంసన్ , జైశ్వాల్ నిరాశ పరిచాడు. హస్ రంగా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై ఓటమి పాలైంది. చివరి ఓవర్ దాకా ఉత్కంఠ చోటు చేసుకుంది. ధోనీ మైదానంలోకి వచ్చినా ఫలితం లేకుండా పోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆదిలోనే రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద దెబ్బ తగిలింది. యశస్వి జైశ్వాల్ మరోసారి పేలవమైన షాట్ కొట్టి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత నితీశ్ రాణా , శాంసన్ కలిసి మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నితీశ్ రాణా రెచ్చి పోయాడు. ఏ మాత్రం కనికరం చూపలేదు చెన్నై బౌలర్లపై. 36 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 5 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు. రియాన్ పరాగ్ 28 బంతుల్లో 37 రన్స్ చేశాడు. నూర్ అహ్మద్ , మతీష్ పతిరానాతో పాటు ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు చొప్పున కూల్చారు. అనంతరం బరిలోకి దిగిన చెన్నై 6 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది.