4 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఓటమి
కోల్ కతా – ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపుకు దగ్గరగా వచ్చి ఓటమి చవి చూసింది కోల్ కతా నైట్ రైడర్స్. క్రీజులో రింకూ సింగ్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. 239 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది. సునీల్ నారాయణ్ 13 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతో 30 రన్స్ చేయగా కెప్టెన్ అజింక్యా రహానే 61 పరుగులు చేశాడు. 35 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్స్ లు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 6 ఫోర్లు ఓ సిక్స్ తో 45 రన్స్ చేయగా ఆఖరులో రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు. తను 24 రన్స్ కొట్టాడు. అయినా ఫలితం లేక పోయింది.
కోల్ కతా స్కిప్పర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ సాధించింది. మార్క్రామ్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతో 47 రన్స్ చేయగా మిచెల్ మార్స్ సూపర్ గా ఆడాడు. 48 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు 5 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు. కోల్ కతాకు చుక్కలు చూపించాడు. మైదానంలోకి వచ్చిన నికోలస్ పూరన్ దంచి కొట్టాడు. కోల్ కతా బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 7 ఫోర్లు 8 సిక్సర్లతో 86 రన్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 రన్స్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్.