9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్ తగిలింది. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ సాల్ట్ సూపర్ షో చేశాడు. 65 పరుగులతో చెలరేగి పోగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 62 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. దేవవత్ పడిక్కల్ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రెండో వికెట్ కు సాల్ట్ , కోహ్లీ కలిసి 83 పరుగులు జోడించారు. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది నాలుగో విజయం కావడం విశేషం.
రాయల్స్ స్టార్ బౌలర్ సందీప్ శర్మ వేసిన 4వ ఓవర్ లో కోహ్లీ క్యాచ్ విడిచాడు. సాల్ట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను సందీప్ జార విడిచాడు. ఆ తర్వాత వీరిద్దరు చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వచ్చింది. సాల్ట్, కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికి ఆరేశారు. పవర్ ప్లే లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 65 పరుగులు చేయడం విశేషం. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 173 పరుగులకే పరిమితమైంది. శాంసన్ 15 , జైశ్వాల్ 75 పరుగులు చేశారు. పరాగ్ 30 రన్స్ చేశాడు.