పవార్ రూ. 1000 కోట్ల ఆస్తులకు లైన్ క్లియర్
తీపి కబురు చెప్పిన ఆదాయ పన్ను శాఖ
మహారాష్ట్ర – మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు భారీ ఊరట లభించింది. గతంలో కేంద్ర ఐటీ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ. 1000 కోట్లకు సంబంధించి ఆస్తులను సీజ్ చేసింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అజిత్ పవార్ భారతీయ జనతా పార్టీతో స్నేహం చేయడం మొదలు పెట్టారు.
తాజాగా మహారాష్ట్రలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ (ఎన్సీపీ) భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆయన చివరి వరకు సీఎం రేసులో ఉన్నారు. కానీ అనుకోకుండా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా అయ్యారు. ఇదే సమయంలో షిండేతో పాటు అజిత్ పవార్ కు మంచి ఛాన్స్ లభించింది. కీలకమైన ఉప ముఖ్యమంత్రి పోస్ట్ దక్కింది. దీంతో కేంద్రంలోని మోడీ సర్కార్ తో సఖ్యతతో ఉండడంతో తన కేసుకు సంబంధించి లైన్ క్లియర్ చేయించుకున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఇది పక్కన పెడితే సీజ్ చేసిన ఆస్తులకు సంబంధించి ఇవాళ కేంద్ర ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. రూ. 1000 కోట్ల విలువైన ఆస్తులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అజిత్ పవార్ తో పాటు ఆయన కుటుంబం సంతోషంగా ఉంది.