ట్యాక్స్ ఎగ్గొట్టిన డబ్బులను ఎక్కడికి తరలించారు
హైదరాబాద్ – తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా విస్తరించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని సంస్థల డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32, రోడ్ నం 10లో బొప్పన సుష్మ, సీమ ఇళ్లలో నిన్న సాయంత్రం నుండి ఇప్పటి దాకా దాడులు చేపట్టడం విస్తు పోయేలా చేసింది. టాక్స్ ఎగొట్టిన డబ్బును ఎక్కడికి తరలించారనే అంశంపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పడం లేదని తెలిసింది.
ఐఐటీ , నీట్ పేరుతో లక్షలాది మంది విద్యార్థులను మోసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీ చైతన్యతో పాటు నారాయణ, ఇతర కాలేజీలు కూడా ఇదే దందా కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యాపారం చేస్తూ మోసం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ర్యాంకుల ప్రకటనలతో ఆకర్షితులై ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. కానీ కనీస వసతి సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యాలు పట్టించు కోవడం లేదు. విచిత్రం ఏమిటంటే నారాయణ విద్యా సంస్థలకు చైర్మన్ గా ఉన్న నారాయణ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.
ముందు నుంచీ ఈ విద్యా సంస్థలు సాగిస్తున్న నిలువు దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేసేది వ్యాపారం కానీ చెప్పేది మాత్రం విద్యా పరంగా జెమ్స్ ను తయారు చేస్తున్నామని. వీరికి ఆయా ప్రభుత్వాలు అండగా ఉంటుండడం బాధాకరం.