గాడి తప్పిన రేవంత్ పాలన
నిప్పులు చెరిగిన జగదీశ్వర్ రెడ్డి
నాగార్జున సాగర్ – మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగార్జునసాగర్ లోని నందికొండను సందర్శించారు. కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంకును పరిశీలించారు. ఈ సందర్బంగా జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
2014కు ముందు తెలంగాణ ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొందో అలాంటి దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు జగదీశ్వర్ రెడ్డి.
కలుషితమైన నీటిని తాగిన వారందరికీ ప్రభుత్వమే దగ్గరుండి పరీక్షలు నిర్వహించాలని, వారిని రక్షించాల్సిన బాధ్యత కూడా సీఎందేనంటూ స్పష్టం చేశారు. ఇంతటి బాధ్యతా రాహిత్యంతో కూడిన పాలనను తాను ఎన్నడూ చూడలేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటనతో ఒక్కసారిగా విస్తు పోయినా దీని గురించి ఒక్క పల్లెత్తు కూడా సీఎం ప్రస్తావించక పోవడం దారుణమన్నారు. ఓ వైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తాము చెబితే వివరాలు ఇవ్వాలని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందన్నారు.